మియాపూర్, సెప్టెంబర్ 1 : మాదాపూర్ డివిజన్ సాయినగర్‌కు చెందిన జ్యోతికి రూ.5 లక్షలు, గచ్చిబౌలి డివిజన్ కాజానగర్కు చెందిన లక్ష్మీనారాయణకు రూ.1.50 లక్షలు సీఎం సహాయ నిధి పథకం కింద దవాఖాన ఖర్చుల నిమిత్తం మంజూరు కాగా అందుకు సంబంధించిన పత్రాలను విప్ అరెకపూడి గాంధీ బుధవారం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. కార్పొరేట్ వైద్యం ద్వారా ఆరోగ్యాలకు బాగు చేసుకునేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంలా సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తున్నదన్నారు.
కొండాపూర్, సెప్టెంబర్ 1 : భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్య నియంత్రణ, సులభ, సుఖవంత, చౌక ప్రయాణాలకు కేరాఫ్‌గా ఎలక్ట్రిక్ వాహనాలు నిలుస్తాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం భారీ రాయితీలను కల్పిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం మినహాయించినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణకై యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, షోరూమ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.