మియాపూర్ , ఆగస్టు 30 : పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని, పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను సాకారం చేసేందుకు అండగా నిలుస్తానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఎందరో పేద విద్యార్థులకు చదువు కోసం తోచిన సహాయాన్ని అందిస్తున్నానని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌కు చెందిన నిరుపేద విద్యార్థి సుమంత్‌కు ఇంజినీరింగ్ విద్య కోసం కళశాల ఫీజు రూ.1,25,600 మొత్తాన్ని చెక్కు రూపంలో విప్ గాంధీ సోమవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో విద్యార్థికి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకస్మికంగా కుటుంబ పెద్ద పోవటంతో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని చదివిస్తున్నానని, వారితో పాటు వారి కుమారుడికి ఫీజు చెల్లించామన్నారు. దాతల సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తన పరిధిలో పేద విద్యార్థులు ఆర్థిక సమస్యతో చదువుకు దూరం కానివ్వబోనని ఆయన హామీ ఇచ్చారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ ఫేజ్ 2 కు చెందిన సలోమికి దవాఖాన ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా రూ. 2లక్షల చెక్కును తన నివాసంలో ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. సీఎం సహాయ నిధి పేదలకు కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.