మియాపూర్, ఆగస్టు 14 : టీకా ద్వారానే కరోనా కట్టడి చేయవచ్చునని, ప్రజలందరూ ముందుకు వచ్చి తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ను వేస్తున్నదని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఆర్పీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్లు రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సిన్ సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీల మధ్యకే వచ్చి మొబైల్ వాహనాలు టీకా సేవలను అందిస్తున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విప్ గాంధీ కోరారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ టీకాను తీసుకోవాలన్నారు. పారిశుధ్య చర్యలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, బాబూరావు, లింగయ్య, రాధాబాయి, సాయిబాబా, మధు, ప్రవీణ్, కృష్ణ, గిరిబాబు, సంతోష్, చిన్న, హన్మంతు, సంధ్య, లలిత, శశికళ, సత్యనారాయణ, రాధా తదితరులు పాల్గొన్నారు.