మియాపూర్, ఆగస్టు 12 : ఏండ్ల తరబడిగా మురుగునీటి నిల్వకు కేంద్రంగా మారిన చెరువులు ఇకనుంచి శుద్ధ జలాలతో కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. చెరువుల సంస్కరణే లక్ష్యంగా ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధిచేసిన తర్వాతే స్వచ్ఛమైన జలాలు చెరువుల్లోకి చేరేలా.. ప్రభుత్వం ఇప్పటికే ఎస్టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నగర వ్యాప్తంగా 13 ఎస్టీపీల నిర్మాణానికి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం అందులో ఏడు ఎస్టీపీలను ఐటీకి వేదికైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే చేపట్టబోతున్నది. ఈ మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావటంతో స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ నేతృత్వంలో జలమండలి ఎస్టీపీ విభాగం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా స్థల సేకరణ ప్రక్రియను ముమ్మరం చేశాయి. వారంలోగా స్థలాల సేకరణను పూర్తి చేసి ఎస్టీపీల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడు చెరువుల వద్ద సుమారు రూ.404 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎస్టీపీల నిర్మాణ పనులు 2023 జూన్ వరకు పూర్తికానున్నాయి.
నియోజకవర్గం వ్యాప్తంగా 7 చెరువుల వద్ద రూ.404 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకు సంబంధించి స్థల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. నెలాఖరుకల్లా నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఉంటుంది. మురుగునీరు, దుర్వాసన, దోమల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.
నియోజకవర్గం వ్యాప్తంగా 7 ఎస్టీపీల ఏర్పాటుకు సుమారు 20 ఎకరాల వరకు స్థలం అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఎల్లమ్మ చెరువు వద్ద 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పటేల్ చెరువు వద్ద ఎకరానికి పైగా స్థలం ఇప్పటికే అందుబాటులో ఉన్నది. దుర్గం చెరువు వద్ద సొంత స్థలంలోనే నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎఫ్టీఎల్ పరిధిలోకి రాకుండా మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.