మియాపూర్, ఆగస్టు 7: పేదల ఆకలి తీర్చటమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా అవసరమైన పథకాలను ప్రజల దరికి చేరుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజవకర్గవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ఫేజ్ 1 సాయి కల్యాణ మండపంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ గాంధీ శనివారం పేదలకు రేషన్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.
పేదలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయికి వెళ్లి అర్హులను గుర్తించి రేషన్ కార్డులను అందించటం ద్వారా ఆహార భద్రతను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, అర్హులందరికీ రేషన్ కార్డులు దక్కుతాయని విప్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇది తమ సీఎం కేసీఆర్ సమర్థపాలనకు నిదర్శమన్నారు. ప్రభుత్వ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జిల్లా గణేశ్, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, కృష్ణారావు, అంజిరెడ్డి, కాశీనాథ్, శ్రీనివాస్, రాజేశ్, వెంకట్, వాసు, మున్నా, కుమారి, మధులత తదితరులు పాల్గొన్నారు.