మియాపూర్( హైదరాబాద్ ) : రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) శాసన సభలో ప్రకటించినట్లుగా రాబోయే ఎన్నికలలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధించటం తథ్యమని ఎమ్మెల్యే విప్ ఆరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ సాయినగర్‌కు చెందిన బిజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు పార్టీ డివిజన్ అధ్యక్షులు గౌతం గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలనే కాకుండా విపక్షాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా ఆయా పార్టీలలోని యువత బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయని, ఎన్నికల ప్రకటనలోగా పార్టీల దుకాణాలు మూసుకుపోవటం ఖాయమన్నారు.
కల్యాణ లక్ష్మి, దళిత బంధు, రుణమాఫీ, బీసీ బంధు, కేసీఆర్‌కిట్, సహా మరెన్నో సంక్షేమ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు రెండు దఫాలుగా తమకు అధికారం అందించారని, ఇదే విశ్వాసంతో మూడోసారి సంపూర్ణ అధికారాన్ని తమకే అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలో చేరే వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ విజయానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఇబ్రహీం, కాశీ, శ్రీధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.