మియాపూర్, ఏప్రిల్ 12: భారీ షాపింగ్ చేస్తామని బిల్డప్ ఇస్తూ ఖరీదైన చీరలను ఎత్తుకెళ్తున్న ఓ దొంగల ముఠా ఆట కట్టించారు మియాపూర్ పోలీసులు. ఓ వస్త్ర దుకాణంలో ఖరీదైన చీరను ఎత్తుకెళ్లారని ఓ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి, వారిని అరెస్టు చేశారు.
మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు, సుభాషిణి, యశోద, తిరుపతమ్మ, రమణ, వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్వర్లు సహా పలువురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి బట్టల దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 3వ తేదీన మియాపూర్లోని ఎంఏ నగర్లోని ఓ వస్త్ర దుకాణంలోకి బట్టలు కొనే సాకుతో ఈ బృందం లోపలికి వెళ్లింది. ఈ సందర్భంగా దుకాణదారుడిని మాయమాటల్లో పెట్టి వారు ఖరీదైన చీరను కొట్టేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బృందం వెళ్లిపోయిన తర్వాత చీర లేదని గ్రహించిన దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దొంగల ముఠాను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.ఈ ముఠా మియాపూర్తో పాటు మధురా నగర్, సరూర్ నగర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు దుకాణాల్లో కూడా ఖరీదైన చీరలను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠాను పట్టుకున్న సీఐ క్రాంతి, డీఐ రమేశ్ నాయుడు, ఇతర సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.