Miyapur | మియాపూర్, ఏప్రిల్ 5 : దుర్వాసనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం కలిగేలా కాలనీ మధ్యలో నుంచి చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న డ్రైనేజీ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. తక్కువ దూరం నుంచి వెళ్లే డ్రైనేజీకి భిన్నంగా అధిక నిధులతో దూరంగా నిర్మించనున్న విధానాన్ని ఆపేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం వీడియా కాలనీలో చేపడుతున్న డ్రైనేజీ పనులను కాలనీవాసులు నిలిపేశారు .అనంతరం తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ఇప్పటికే పటేల్ చెరువులకు అనుసంధానంగా పటిష్ట డ్రైనేజీ ఉన్నందున దానిని విస్తరించి పనులను చేపట్టాలని అన్నారు. కాలనీ నడిమధ్యలో నుంచి డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం ద్వారా దుర్వాసనతో పాటు తాగునీటి పైపులైన్లు దెబ్బతింటాయని మ్యాన్హోల్స్తో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వరదనీటి కాలువగా చేపడతామని చెప్పి, డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతుండడం సరైనది కాదన్నారు.
నిర్మాణాన్ని కాలనీ మధ్యలో నుంచి చేపట్ట వద్దని ఇప్పటికే ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్, జలమండలి, ఎస్ఎన్డీపీ అధికారులకు విన్నవించినట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో ఉన్న నాలాను విస్తరించి మురుగు నీటిని తరలించాలని కాలనీ మధ్యలో నుంచి నూతన డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సమ్మెట ప్రసాద్ ,వెంకటేశ్వరరావు, సుప్రియ, శంకర్ ,ఉమా కిషన్ ,విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.