శంషాబాద్ రూరల్, జూలై 6 : రెండు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గ్రామ శివారులో శవమై కనిపించిన సంఘటన శంషాబాద్ మండలంలోని పిల్లోనిగూడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. పిల్లోనిగూడ గ్రామానికి చెందిన దుబ్బచర్ల బాలరాజ్ (45) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోవడంతో బాలరాజ్ ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో నుండి బయలుదేరిన అతడు తిరిగి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో పిల్లోనిగూడ గ్రామం నుంచి జూకల్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడి ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటానాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నగరంలోని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.