మాదాపూర్, ఆగస్టు 13 : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడిని కుటుంబసభ్యుల ఒడికి చేర్చేందుకు ఆధార్‌కార్డు సహాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంపాటి సందీప్ అలియాస్ సూర్య 2018 మార్చి 23న పాఠశాలకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులతో చెప్పి వెళ్లాడు. అయితే ఆరోజు పాఠశాలకు వెళ్లకుండా తన స్నేహితుడి పుట్టినరోజుకు హాజరై తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో బాలుడి కోసం వెతికిన కుటుంబసభ్యులకు గ్రామ శివారులో పాఠశాల బ్యాగ్, సైకిల్ దొరికింది. దీంతో బాలుడి తండ్రి కుంపాటి కరుణాకర్ భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కుటుంబసభ్యులకు దూరమైన బాలుడు హైదరాబాద్ వచ్చాడు. పొట్టకూటి కోసం చాలా కష్టాలు పడ్డాడు. చివరకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్లి అక్కడ హౌస్ కీపింగ్‌లో చేరాడు. మార్చి 21న బాలుడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. మాదాపూర్‌లోని ఆధార్ సేవ కేంద్రంలో కొత్త ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. నిర్వాహకులు చిరునామాకు వస్తుందని తెలుపడంతో బాలుడి వెనుదిరిగి వెళ్లిపోయాడు. నెలలు గడిచినా ఆధార్ కార్డు రాకపోవడంతో.. ఇటీవల మాదాపూర్ ఆస్క్ను సందర్శించి సెంటర్ మేనేజర్ భవానీహరిదాస్ను సంప్రదించాడు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు ఇప్పటి వరకు తాను ఇచ్చిన చిరునామాకు రాలేదని చెప్పాడు. ఆస్క్ సెంటర్ మేనేజర్ బాలుడిని తండ్రి, తల్లి వివరాలు అడిగారు. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన సోదరి వద్ద ఉంటున్నట్లు చెప్పాడు.
ఆస్క్ సెంటర్ మేనేజర్ భవానీహరిదాస్ ప్రాంతీయ కార్యాలయ అధికారులను 2021 మార్చిలో దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి సంప్రదించగా సందీప్ అలియాస్ సూర్య బయోమెట్రిక్ వేరొక ఆధార్‌తో పోలిఉండటంతో ఆధార్ నమోదు తిరస్కరించబడిందని, 2011 లో బాలుడికి మరో ఆధార్ కార్డు ఇదివరకే ఉన్నదని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ తన మొబైల్‌తో సందీప్ తండ్రికి ఫోన్ చేసి మాదాపూర్‌కు రావాలని తెలిపారు. వివరాలు తెలుసు కొని శుక్రవారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.