Hyderabad | హిమాయత్ నగర్, మార్చి25 : ప్రేమ పేరుతో ఓ బాలికను మభ్య పెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడిని మంగళవారం నారాయణగూడ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. నారాయణగూడ దత్తానగర్‌కు చెందిన చతుర్వాల రోహిత్ సింగ్(21) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం రోహిత్ సింగ్ కు ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆసరా చేసుకుని బాలికకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఈ నెల 23న బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి బయటకు పిలిపించిన రోహిత్ సింగ్ ముషీరాబాద్‌కు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మాయమాటలతో మభ్యపెట్టి తమ కుమార్తె జీవితంతో చెలగాటమాడిన రోహిత్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. రోహిత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. బాలికను పోలీసులు భరోసా సెంటర్‌కు తరలించి వాంగ్మూలం రికార్డు చేయగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.