బడంగ్‌పేట, నవంబర్ 8: మాయమాటలతో నమ్మించిన ఇద్దరు యువకులు తమకు తెలిసిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. లెనిన్ నగర్‌కు చెందిన ( 13) బాలిక 9వ తరగతి చదువుతున్నది. ఈనెల 5వ తేదీన బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు ఆపారు. ఇంటి వద్ద దించుతామని చెప్పడంతో వారి బైక్‌పై కూర్చుంది. తెలిసిన వ్యక్తులు కావడం వల్లే బైక్‌పై కూర్చునట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. బైక్‌పై ఎక్కించుకున్న ఆ ఇద్దరు యువకులు బాలాపూర్ దేవతాల గుట్ట, బడంగ్‌పేట పరిసర ప్రాంతాల్లో తిప్పారు. చివరకు లెనిన్ నగర్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను ఇంటి వద్ద వదిలేసి పోయారు. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావంటూ తల్లి ప్రశ్నించడంతో.. ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి.. అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. బాలిక తల్లి ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. ఇద్దరిలో రతన్ (22)తో పాటు మరొక నిందితుడు మైనర్ అని ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఎవరూ కిడ్నాప్ చేయలేదు..
– ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి
బాలికను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఎలాంటి మత్తు ప్రయోగం కూడా చేయలేదు. నిందితులిద్దరూ బాలికకు తెలిసిన వారే. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. మొదట ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించాం. అతడికి ఈ కేసుతో సంబంధం లేదని తేలడంతో విడిచిపెట్టాం. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.