సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సహస్ర హత్యకేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటి పక్కనే ఉండే 14 ఏండ్ల బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అవినాశ్ మహంతి వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి, సంగీత్‌నగర్‌లో నివాసముండే 14 ఏండ్ల బాలుడు కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి తాగుడుకు బానిస కావడంతో చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అతడి తల్లే కుటుంబాన్ని పోషిస్తున్నది. అయితే బాలుడు తరచూ క్రైమ్ సంబంధిత సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లను ఎక్కువగా చూస్తుంటాడు. దొంగతనాలు ఎలా చేయాలి..? ఇంటి తాళాలు ఎలా పగులగొట్టాలి? ఆధారాలు లభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైనా వస్తే వారికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి.. అనే అంశాలను బాగా గమనించేవాడు.
ఈ క్రమంలో దొంగతనాలు చేయడంపై స్క్రిప్ట్ కూడా రాయడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా తనకు ఏదైనా నచ్చితే దానిని దొంగిలించైనా పొందాలనే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఈ క్రమంలోనే బాలుడి ఇంటి పక్కనే నివాసముండే సహస్ర (10) సోదరుడు సద్విన్ వద్ద ఉన్న క్రికెట్ బ్యాట్‌పై బాలుడి కన్ను పడింది. ఎంఆర్ఎఫ్ అనే స్టిక్కర్‌తో కూడిన క్రికెట్ బ్యాట్‌ను తనకు ఇవ్వాలని గతంలో ఒకసారి సద్విన్తో గొడవ పడ్డాడు. కానీ బ్యాట్ ఇచ్చేందుకు సద్విన్ నిరాకరించాడు.
ఇంట్లోకి చొరబడి..
తనకు నచ్చిన బ్యాట్‌ను ఎలాగైన దక్కించుకోవాలని నిర్ణయించుకున్న బాలుడు.. అదును కోసం నిరీక్షించాడు. ఇందులో భాగంగానే ఈనెల 18న ఉదయం 9గంటల సమయంలో సహస్త్ర తల్లిదండ్రులు కృష్ణ, రేణుక ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించాడు. ఇదే అదునుగా భావించిన బాలుడు.. వారి ఇంటిలో ఉన్న బ్యాట్‌ను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మూడు రోజుల కిందట ఓటీటీలో చూసిన వెబ్‌సిరీస్ ఆధారంగా ఇంటి తాళాన్ని కోసేయడానికని ఒక కత్తిని వెంట పెట్టుకుని తన భవనంలోని మూడో అంతస్తు నుంచి దానికి ఆనుకుని ఉన్నే సహస్ర ఉండే భవనంలోకి దూకాడు.
ఇంటికి తాళం ఉందనుకుని వెళితే, తలుపులు దగ్గర వేసి ఉన్నాయి. అయితే సహస్త్ర తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని కళ్లారా చూసిన బాలుడు.. ఇంటి తలుపులు దగ్గరకు వేసి, వెళ్లి ఉంటారని భావించి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో వెంటనే క్రికెట్ బ్యాట్ తీసుకుని వచ్చేస్తుండగా, లోపలి బెడ్రూంలో టీవీ చూస్తున్న సహస్ర బాలుడిని గమనించి దొంగా, దొంగా అని అరిచింది. తీరా చూస్తే తన తమ్ముడి స్నేహితుడు, పక్కింటి బాలుడు కావడంతో విషయాన్ని మా అమ్మకు చెబుతానని, చెప్పింది.
దీంతో దొరికిపోతానని భయాందోళనకు గురైన బాలుడు.. ఇంటి తాళం కోయడానికని తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను బెడ్రూంలో కింద పడవేసి, కండ్లు మూసుకుని విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం రక్తం మరకలు అంటిన చేతులను బాలిక ఇంట్లోనే కడుక్కుని, ఏమీ తెలియనట్లు తలుపులు దగ్గరకు వేసి, వచ్చిన దారిలోనే గోడ దూకి తన భవనంలోకి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12.30గంటలకు బాలిక తండ్రి కృష్ణ ఇంటికి వచ్చి చూడగా సహస్ర రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తప్పుదారి పట్టించిన నిందితుడు..
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించడంతో పాటు ఘటన జరిగిన భవనంలో నివాసం ఉండే వారితో పాటు దాని పక్కనే ఉన్న భవనంలోని వారినికూడా విచారించారు. ఈ క్రమంలోనే బాలుడిని సైతం విచారించగా, సహస్త్ర ఇంటి నుంచి ఏదో అరుపులు వినిపించాయని చెప్పడంతో ఎవరో దుండగులు వచ్చి హత్యచేసి ఉంటారని పోలీసులు భావించారు. బాలిక హత్య కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న ఒక్క సీసీ ఫుటేజీలో ఆ భవనంలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించకపోవడం, అక్కడ లభించిన వేలి ముద్రలు పాత నేరస్తులు, అనుమానితులతో సరిపోలకపోవడంతో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది.
అప్పటికే దాదాపు 6 మందిని అదుపులోకి తీసుకుని, ఆధారాలు సరిచూసినా ఎక్కడా కూడా అవి మ్యాచ్ కాలేదు. ఇక చివరి అస్త్రం పోస్టుమార్టం నివేదిక. దీనిపై దృష్టిపెట్టిన పోలీసులు పోస్టుమార్టం నివేదికను విశ్లేషించారు. అందులో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేల్చారు. అయితే బాలిక మృతదేహంపై ఉన్న కత్తిపోట్లు బలంగా లేవని అవి చాలా తక్కువ లోతు వరకే ఉన్నట్లు తెలిపారు. బాలిక కత్తిపోట్లతో వెంటనే మరణించలేదని, తీవ్ర రక్తస్రావం కావడంతో మృతిచెందినట్లు వైద్యులు వివరించారు.
అంతే కాకుండా బాలికపై చిన్న వయస్సువారు దాడి చేసి ఉండవచ్చని, అందుకే బలహీనమైన కత్తిపోట్లు ఉన్నట్లు అంచనా వేశారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా హత్య చేసింది పెద్దవారు కాదని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా మరోసారి ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు సహస్ర నివాసం ఉండే ఇంటికి ఆనుకుని ఉన్న భవనంలో నివసించే వారందరినీ విచారించారు. ఇందులో భాగంగా ఆ భవనంలో నివాసం ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, హత్య జరిగిన రోజు ఒక బాలుడు పక్క భవనం లోకి వెళ్లినట్లు గమనించానని వెల్లడించాడు.
దీంతో పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పిన ఆనవాల ఆధారంగా అదే భవనంలోని 4వ అంతస్తులో నివాసం ఉండే 14 ఏండ్ల బాలుడిని మరోసారి అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురై ఉన్న బాలుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల సమక్షంలో ఇంటిని తనిఖీ చేయగా, బాలిక హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తం మరకలున్న దుస్తులు, దొంగిలించిన క్రికెట్ బ్యాట్ లభించాయి. పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు.