కొండాపూర్, డిసెంబర్ 15: మాదాపూర్‌లోని శిల్పారామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ఆదివారం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు కొనసాగే ఈ మేళాలో దేశంలోని 20 రాష్ర్టాల నుంచి విచ్చేసిన చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించనున్నారు. మేళాలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు ఆధ్వర్యంలో వివిధ రాష్ర్టాల నుంచి విచ్చేసే కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు, వీవర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అరుణ్‌కుమార్, శిల్పారామం జనరల్ మేనేజర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.