మన్సూరాబాద్, ఆగస్టు 25: యాదవ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని, ఆ కులాలకు చెందిన ఐదుగురిని ఎమ్మెల్యేలుగా,ఒకరిని రాజ్యసభ సభ్యుడిగా చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్హాల్లో యాదవ యద్ధభేరి సభ పేరిట బహిరంగ సభను నిర్వహించారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మంది యాదవులకు అవకాశాలు కల్పించిందని, రాబోయే ఐదేండ్లలో యాదవులకు మరిన్ని అవకాశాలు దక్కేలా కృషి చేస్తానని తెలిపారు.
యాదవ భవనం కోసం కోకాపేటలో సుమారు రూ.400 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. యాదవ భవన నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని త్వరలో ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. యాదవుల హక్కులను సాధించే దిశగా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానని తెలిపారు.యాదవులు ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాబోయే శ్రీకృష్ణాష్టమి, దీపావళి సదర్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని అందుకు కావల్సిన సహాయ, సహకారాలను ప్రభుత్వ పక్షాన అందిస్తానని తెలిపారు. రెండు, మూడు నెలల్లో పరేడ్ గ్రౌండ్ లేదా నిజాం కాలేజ్ గ్రౌండ్లో సుమారు 25 లక్షల మంది యాదవులతో పెద్ద ఎత్తున సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, కోదాడలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్యను ఓడించిన చరిత్ర యాదవులదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే యాదవులకు న్యాయం
రాష్ట్రంలో గులాబీ జెండా అధికారంలోకి వచ్చిన తరువాతనే యాదవ కులస్తులకు న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్యయాదవ్ అన్నారు. సీఎం రమేశ్, సుజనాచౌదరి లాంటి వాళ్లు కోట్ల రూపాయలు ఇచ్చి రాజ్యసభ సీట్లు తెచ్చుకున్నారని కానీ తాను మాత్రం పైసా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా చేశారని తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ముందు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవుల అభివృద్ధికోసం మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల ప్రధాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజ్ మండల్, ఎమ్మెల్యే రాజేందర్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్, శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ చైర్మన్ రవీంద్రనాథ్ యాదవ్, ప్రతినిధులు శ్రీనివాస్‌యాదవ్, చిన్న శ్రీశైలంయాదవ్, శేషుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.