
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 13 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. పేదల కోసం ఇండ్లు ఇస్తామన్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వాటాధనం తీసుకొని మొండి చేయి చూపింది. జేఎన్ఎన్యూఆర్ఎం కింద ఇండ్లు నిర్మించి వాటిని వదిలేయడంతో శిథిలావస్థకు చేరాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న 2336 జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న ఇండ్లను అర్హులకు కేటాయించడం ద్వారా సమస్యకు పరిషారం చూపనున్నది. త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిపించి జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల అంశంపై చర్చించారు. ఆనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో హమాలీ బస్తీ, సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని గైదన్ బాగ్ కస్తుర్బా నగర్, ఓల్డ్ పాటిగడ్డ, ఎన్బీటీ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్ఐసీ కాలనీ, అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని వీరన్నగుట్ట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని సర్వే నం 82, 128, 83, ఉప్పుగూడ ఎక్స్ సర్వీస్‌మెన్, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని పూల్ బాగ్ -1,2, మలక్ పేట నియోజకవర్గ పరిధిలోని నందనవనం-2, ముంగనూర్ తదితర 16 ప్రాంతాలలో 2006-2008 సంవత్సరాల మధ్యకాలంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 10,178 ఇండ్లను నిర్మించారని అన్నారు. వీటిలో 2336 ఇండ్లను వివిధ కారణాలతో లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని.. త్వరలో వాటిని లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.