tenzing norgay Awards| హనుమకొండ చౌరస్తా: టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ మంగళవారం తెలిపారు. అర్హతల గలవారు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు కామన్ అవార్డ్స్పోర్టల్ https://awards.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సాహస రంగంలో అసమాన ప్రతిభ చూపిన వ్యక్తుల విజయాలను గుర్తించడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు (TNNAA)’ను ప్రారంభించిందని ప్రశాంత్ వెల్లడించారు. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మంత్రిత్వ శాఖలో సమర్పించిన దరఖాస్తులను తిరస్కరిస్తామని పేర్కొన్నారు.
రాష్ర్ట ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన విభాగాల యువజన / క్రీడా శాఖ లేదా ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ వంటి గుర్తింపు పొందిన అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ లేదా ఆర్మీ/ నేవీ/ వైమానిక దళం లేదా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు లేదా ఇలాంటి ఇతర పారా మిలిటరీ దళాలు అవార్డు కోసం సిఫారసు చేయవచ్చన్నారు.
సంబంధిత విభాగాలు/ సంస్థలు దరఖాస్తుదారునికి తమ సిఫారసును ఈ-మెయిల్ ద్వారా లేదా మరేదైనా తగిన పద్ధతి ద్వారా అందించవచ్చని తద్వారా వారు అవార్డుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆర్మీ/నేవీ/వైమానిక దళంలోని సేవలందించే సిబ్బందికి సంబంధించిన అన్ని నామినేషన్లను వారి సంబంధిత అడ్వెంచర్ సెల్/డైరెక్టరేట్ సిఫారసు చేయాల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
3 సంవత్సరాల నుంచి చేసిన సాహస కృత్యాల గురించి వివరిస్తూ 3 పాస్‌పార్ట్ సైజ్ ఫొటోలు జతచేసి ఆగస్టు 20లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.