అబిడ్స్, జూన్ 19: అధునాతనంగా నిర్మించిన బేగంబజార్ ఫిష్ మార్కెట్లో అర్హులైన వారికి ఈ నెల 25వ తేదీ లోపు దుకాణాలను కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బేగంబజార్ ఫిష్ మార్కెట్‌ను అధికారులతో కలిసి సందర్శించారు. స్థానికంగా చేపలు విక్రయించే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, వినియోగదారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ రూ.10 కోట్లతో గ్రౌండ్, మూడు అంతస్తులతో భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు.
కొన్ని దుకాణాలను అర్హులైన పాతవారికి కేటాయించామని, మిగిలిన దుకాణాలను ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న అర్హులైన వారికే కేటాయిస్తామన్నారు. ఈ దుకాణాల కేటాయింపునకు గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురు కమిటీ సభ్యులు అర్హులైన వ్యాపారులను గుర్తించి వారికి దుకాణాల కేటాయింపు జరిగేలా చూస్తారన్నారు. మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, అదనపు డైరెక్టర్ రాథోడ్, మత్స్య శాఖ అధికారి చరితారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.