సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే 150 వార్డు స్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలనపై బుధవారం ఏర్పాటైన సమీక్ష సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్లతో కలిసి మంత్రి తలసాని సమీక్షించారు. 16వ తేదీన ప్రారంభించనున్న వార్డు కార్యాలయాలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని మంత్రి తలసాని సూచించారు.
వార్డు కార్యాలయం ఉదయం 8:30 గంటలకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యాలయాలకు ముందు టెంట్, మైక్, షామియానాలు, అల్పహారం, తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వార్డు కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వార్డు కార్యాలయం ప్రారంభం అనంతరం జోనల్ కమిషనర్లు ప్రతి వారం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ జియావుద్దీన్, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, మమత, పంకజ, సామాట్ అశోక్, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.