ఖైరతాబాద్, జనవరి 14: తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చెప్పాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెక్లెస్రోడ్లోనీ పీపుల్స్‌ప్లాజా వేదికగా శనివారం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారులకు పతంగులను అందజేశారు.
అనంతరం స్వయంగా పతంగులను ఎగురవేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న, రాష్ట్ర ప్రజలు పాడి పంటలు, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలన్నారు. మన సంస్కృతి, ఆచారాలు, పండుగల గొప్పతనాన్ని చాటి చెప్పాలన్న ఉద్దేశంంతోనే కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను గొప్పగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్ గౌడ్, నాయకులు బాలరాజ్ యాదవ్, శైలేందర్, బాక్సర్ అశోక్, శ్రీనివాస్, తలసాని మహేశ్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్, రాజు, శ్రీహరి, శేఖర్, అబ్బాస్, రజాక్, గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.