సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.
ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేలా ప్రతిరోజు ఒక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 22వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయని, అదేరోజు నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం అమరవీరుల జ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని అన్నారు. అంతకుముందు నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సాయంత్రం 4 గంటల వరకు చేరుకోవాలన్నారు.
అక్కడి నుంచి కళాకారులు డప్పుచప్పుళ్లతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో ర్యాలీగా అమరవీరుల జ్యోతి వద్దకు చేరుకుంటారని అన్నారు. సీఎం కేసీఆర్ అమరవీరుల జ్యోతిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని చెప్పారు. సభ ముగిసిన అనంతరం అందరినీ ఎంతో అబ్బురపర్చే డ్రోన్‌షో నిర్వహిస్తామన్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలుగా కళా ప్రదర్శనలు ఉంటాయని, అంబేదర్ విగ్రహం వద్ద కళాకారులు, డీజేల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప పాలకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి మహమూద్‌అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్లు జగన్మోహన్రావు, నగేశ్, రావుల శ్రీధర్‌రెడ్డి, పార్టీ ఆత్మీయ సమ్మేళనాల హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, వివిధ నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.