అమీర్‌పేట్, మే 2 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకల వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు మంగళవారం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని నూతన పాలక మండలి సభ్యులతో కలిసి ముందుగా అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నూతన పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ మండలిలో దేవాలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కొత్తపల్లి సాయిగౌడ్తో పాటు సభ్యులుగా ఎ.సురేశ్ గౌడ్, ఎం.ఆంజనేయులు యాదవ్, కొండ్రాజు సుబ్బరాజు, కూతురు నర్సింహ, నర్మల అనిల్, బండారు సుబ్బారావు, సరఫ్ సంతోష్‌కుమార్, గొంగటి రోజారెడ్డి, కె.గౌతమ్‌రెడ్డి, గుడబోయిన యాదగిరి యాదవ్, అరుకల సత్యప్రభు గౌడ్, దాసోజు పుష్పలత, ఉప్పల యాదగిరి గుప్త ప్రమాణం చేశారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఆలయ అర్చకులు దతనగాటి అనిల్‌కుమార్ ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. వచ్చే నెల 20న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని నూతన పాలక మండలి సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ, కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.