ఖైరతాబాద్, నవంబర్ 3 : దశాబ్దాలుగా ఖైరతాబాద్‌లో జరిగే సదర్ సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది దీపావళి తర్వాతి రోజు ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా 5వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12గంటల వరకు సదర్ సమ్మేళనం జరుగనున్నది. ఈ మేరకు బుధవారం నిర్వాహకులు రాజు యాదవ్, మహేశ్ యాదవ్, మల్లికార్జున్ యాదవ్, మధుకర్ యాదవ్, ప్రసాద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌ల బృందం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రఘునందన్ రావు, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి తదితరులకు ఆహ్వాపత్రికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్ యాదవ్, మధుకర్ యాదవ్‌లు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని, 5న సాయంత్రం 7గంటలకు శ్రీకృష్ణుడి పూజ నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులతో విన్యాసాలు నిర్వహిస్తామన్నారు. ఖైరతాబాద్, సోమాజిగూడ, దోమల్‌గూడ, పంజాగుట్ట, పురాణాపూల్ తదితర ప్రాంతాల నుంచి సుమారు వందకు పైగా దున్నపోతులు తీసుకువస్తారని తెలిపారు. ఈ సమావేశంలో చౌదరి సత్తయ్య యాదవ్, యాదయ్య, లక్ష్మణ్, భవానీ కృష్ణ, ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.