బేగంపేట్ నవంబర్ 2: రాష్ట్రపతి రోడ్డు చిత్ర దర్గా వద్ద గల నాలాపై ఈ నెల 25వ తేదీ నాటికి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి నాలాపై కొనసాగుతున్న వంతెన నిర్మాణ, నాలా విస్తరణ పనులను పరిశీలించారు. పోలీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చే సేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మోండా మార్కెట్ డివిజన్లోని పాలికబజార్ క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన ఫుట్‌పాత్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో నాలాలోకి ఎగువ నుంచి వచ్చే వరద నీరు సక్రమంగా వెళ్లక పోవడం, నీరు రోడ్లపైకి చేరి రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. సమస్యను పరిష్కరించడం కోసం వంతెన విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. వంతెన ని ర్మాణం పూర్తి అయిందని అప్రోచ్ రోడ్డు నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఈ ప్రాంతపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల అల్ఫా హోటల్ నుంచి సంతోష్ స్వీట్ హౌజ్ వరకు రూ. 2 కోట్ల వ్యయంతో వీడీసీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందులో రోడ్డు పనులు పూర్తయ్యాయని కరోనా కారణంగా ఫుట్‌పాత్ నిర్మాణ పనులు చేపట్టడంలో కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. ఫుట్‌పాత్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి డీజీఎం సురేశ్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్, కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు.