అమీర్‌పేట్, అక్టోబర్ 23 : అభివృద్ధి పనులకు నిధుల లోటు లేకుండా చూస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శనివారం సనత్‌నగర్ డివిజన్లోని సుభాశ్‌నగర్, సుందర్‌నగర్, మోడల్‌కాలనీ, ఉదయ్నగర్లలో కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాసులుతో కలిసి పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో రోడ్డు, పార్కుల అభివృద్ధి, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలు, ఓపెన్ ఎయిర్ జిమ్, ఫుట్‌పాత్ ఆక్రమణలు, పురాతన పైపులైన్ల స్థానంలో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన పైపులైన్ల ఏర్పాటు వంటి సమస్యలను మంత్రి తలసానికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనత్‌నగర్ నియోజకవర్గంలో గత ఏడేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. ఊహించని రీతితో నియోజకవర్గంలో అభివృద్ధి చోటు చేసుకుందని, మంత్రిగా తనకున్న పలుకుబడి వినియోగిస్తూ ఎక్కడా నిధులకు లోటు లేకుండా చూస్తున్నానని తెలిపారు. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించారు. మోడల్‌కాలనీ, సామలకుంట బస్తీ నివాసితులకు మధ్య వివాదస్పదంగా మారిన పార్కు అంశాన్ని కూడా త్వరలో సమావేశమై చర్చించుకుందామన్నారు.
కాలనీల్లో రోడ్లపై స్థానికేతరులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో కాలనీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని సుందర్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాచర్రావు, మోడల్‌కాలనీ ప్రతినిధులు బుచ్చిబాబు, జేఎస్టీ సాయిలు మంత్రి తలసానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే ట్రాఫిక్ అధికారులతో ఫోన్లో మాట్లాడి దీపావళి తరువాత కాలనీ రోడ్లపై స్థానికేతరుల పార్కింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపడుతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల కారణంగా కాలనీ నివాసితులు ఇబ్బందులు పడకుండా చూస్తానని తెలిపారు.