అమీర్‌పేట్, అక్టోబర్ 8:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్‌పేట్‌లోని 50 పడకల ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 14న మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రూ. 3.78 కోట్ల వ్యయంతో మూడంతస్తుల భవనంగా ఈ వైద్యశాలను నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందున్న ప్రభుత్వం ఈ వైద్యశాలను 30 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ..చేతులు దులుపుకొందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్ అవసరమైన నిధులను విడుదల చేయడమే కాకుండా, ప్రజా అవసరాలను గుర్తిస్తూ..50 పడకలకు అప్‌గ్రేడ్ చేసిందన్నారు. ఈ వైద్యశాల ప్రారంభమైతే ఉస్మానియా, గాంధీ దవాఖానలపై భారం తగ్గుతుందని చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం డీసీహెచ్ఎస్ సునీత, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీమోహన్, టీఎస్ఎంఐడీసీ ఈఈ నాయుడు, ఏఎంవోహెచ్ భార్గవ నారాయణ తదితరులు వైద్యశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.