సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/తెలుగుయూనివర్సిటీ : సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు ఒక లక్షకు పైగా విద్యార్థులు ఉంటారని, వారందరికీ పాఠాలు బోధించడానికి జిల్లాలో 6,530 మంది ఉపాధ్యాయులున్నారన్నారు. వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.
విద్యార్థులు రోజులో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారన్నారు. స్కూల్ విద్యార్థులకు తల్లిదండ్రుల పాత్ర ఉపాధ్యాయులే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు రోల్ మోడల్‌గా నిలుస్తారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ, పట్టణ.. అనే తేడా లేకుండా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందడానికి పెద్ద ఎత్తున విద్యార్థులు ముందుకు వస్తున్నారని, తల్లిదండ్రుల్లో కూడా మార్పులు వస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామన్నారు. చాలా మంది పెద్దవాళ్లు, గొప్పవాళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారన్నారు. చదువులు కొంటే ఎన్నటికీ గొప్పవాళ్లు కాలేరన్నారు. ప్రస్తుతం కొంత మంది ఉపాధ్యాయులు కమర్షియల్‌గా మారుతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు, సదుపాయాల కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ నిధుల నుంచి రూ.40 కోట్లు సేకరిస్తున్నామని, ఇందుకు అందరూ ముందుకు వచ్చారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో హరితహారం నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్, జిల్లా విద్యాధికారిని రోహిణి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.