సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జెండా పండుగను గురువారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగరవేయనున్నట్లు చెప్పారు. ఈ జెండా పండుగ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, డివిజన్ కమిటీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వివరించారు. జెండా పండుగ, కమిటీలపై ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ఈనెల 7న ఉదయం 10 గంటలకు జలవిహార్‌లో నిర్వహించే హైదరాబాద్ నగర స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం ఉంటుంది. నగరం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొంటారు. అన్ని కమిటీలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వేర్వేరుగా త్వరలో నూతన అధ్యక్షుల నియామకం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ వేదికగా జిల్లా కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసుకుంటున్నాం. త్వరలోనే జిల్లాల్లో కొత్తగా పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతాం. ఈ జెండా పండుగను పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు విజయవంతం చేయాలి.
రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఏడేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. 24 గంటల పాటు నిరంతర విద్యుత్, నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు వంటి అనేక అద్భుత కార్యక్రమాలు చేపట్టాం. పేదింటి ఆడపడుచుల వివాహానికి ఒక లక్ష 116 రూపాయలు అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 24 గంటల విద్యుత్, మారెటింగ్, పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా అనేక చోట్ల చేపట్టాం. ఇప్పటికే ఇండ్లు పూర్తయిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందజేశాం. దళితుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దళిత బంధు పథకాన్ని కూడా ప్రారంభించాం. ఇంత అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండ్లున్న కబోదులుగా వ్యవహరిస్తున్నారు. నోటికొచ్చినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలి.
ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను ప్రజలు అసహించుకుంటున్నారు. కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండేండ్ల కాలంలో కనీసం రూ. పది లక్షల పనైనా చేశారా..? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేయండి.. అని మంత్రి సూచించారు.
టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గురువారం నిర్వహించే పార్టీ జెండా పండుగను వేడుకలా నిర్వహిస్తున్నాం. వాడవాడలో పార్టీ జెండాను ఎగరవేసే కార్యక్రమాలు చేపట్టాం. గులాబీ పార్టీ సభ్యత్వమే ఒక గౌరవం. టీఆర్ఎస్లోకి వస్తే తల్లి ఒడిలో సేదతీరిన అనుభూతి కలుగుతున్నది. 62 లక్షలకు పైగా ఉన్న టీఆర్ఎస్ సైన్యం చేసుకుంటున్న గులాబీ జెండా పండుగ ఇది. – కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్సీ
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం అన్ని చోట్ల సోషల్ మీడియా వారియర్స్ పార్టీ జెండాను ఎగరవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తాం. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.- వై. సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్