సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)/గోల్నాక/హిమాయత్‌నగర్: వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అంబర్‌పేటలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కొర్వి కృష్ణస్వామి 128వ జయంతి వేడుకలకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణస్వామి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, మంత్రి తలసాని మాట్లాడుతూ రచయితగా, సాహితీవేత్తగా, పాత్రికేయుడిగా కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తలసాని చెప్పారు. ఎన్నో సేవలందించిన ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముదిరాజ్‌ల ఐక్యత కోసం ముదిరాజ్ సంక్షేమ సంఘాన్ని స్థాపించారని తెలిపారు. కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని, ముదిరాజ్ సంఘ భవనం నిర్మించాలని స్థానిక ముదిరాజ్ సంఘం నేతలు మంత్రిని కోరగా, స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంత ఖర్చులతో కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
భవన నిర్మాణం చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్ కుమార్, లావణ్య, పద్మ, మాజీ కార్పొరేటర్ పద్మావతి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు యాదగిరి, సతీష్, మహేష్, శ్రీరాములు పాల్గొన్నారు. అదే విధంగా జూబ్లీహిల్స్ బస్టాప్ వద్ద నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణస్వామి వేడుకలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
నగరాభివృద్ధిలో మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి సేవలు శ్లాఘనీయం అని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ అన్నారు. హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కృష్ణస్వామి చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మహాసభ నాయకులు మందుల వరలక్ష్మి, అల్లుడు జగన్, సతీష్, బొక్కా శ్రీనివాస్ పాల్గొన్నారు.