
బంజారాహిల్స్,ఆగస్టు 28: తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ మేకప్ యూనియన్ నేతలు మంత్రిని కలిసి సమస్యల గురించి వివరించారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సినీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని, 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ సినీ కార్మికులకు హౌసింగ్ అంశంపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, ఠాగూర్, మేకప్ యూనియన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి కేశవ్, కోశాధికారి సాగర్, వెంకటేశ్ తదితరులున్నారు.