
సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకు శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ్యులతో సమావేశమయ్యారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శర్మన్, శాసన మండలి విప్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సురేందర్, జిల్లా విద్యాధికారిని రోహిణి, జిల్లా విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఈఈ రవీందర్ పాల్గొన్నారు.
విద్యా రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించనున్నామని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధుల్లో కొంత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూడా కేటాయిస్తున్నామన్నారు. ఈ నేపథ్యం లో ప్రస్తుత పాఠశాలల స్థితిగతులపై ఫొటోలతో సహా పూర్తి సమాచారం సేకరించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా సమగ్ర నివేదికలు రూపొందించి పది రోజుల్లో అందించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యార్థులకు ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విద్యా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఈఓలు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పాఠశాలల వారీగా సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న నిధులు సక్రమంగా సద్వినియోగమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులను సీవరేజీ, తాగునీటి పైపులైన్ పనుల కోసం ఖర్చు చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
ఏసీడీపీ నిధులతో ప్రభుత్వ, గురుకుల పాఠశాలల అభివృద్ధి పనులు కూడా చేపట్టడానికి అవకాశం కల్పించాలని మంత్రికి పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఏసీడీపీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో రోడ్ కటింగ్ కోసం వసూలు చేసే రుసుం నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన మంత్రి.. జలమండలి, జీహెచ్ఎంసీ వంటి శాఖలకు సంబంధించిన పనులకు అయ్యే ఖర్చులో ఆయా శాఖలు 50 శాతం నిధులు చెల్లించే విధంగా త్వరలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.