
మారేడ్‌పల్లి, ఆగస్టు 26: వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించబోమని, దానికి పునర్వైభవం తీసుకొస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పునరుద్ఘాటించారు. మార్కెట్‌ను అక్కడి నుంచి రామ్గోపాల్పేటకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి గురువారం ఆయన మోండా మార్కెట్లోలోని కూరగాయల మారెట్, మటన్ మారెట్, చేపల మారెట్, పాట్ మారెట్ తదితర ప్రాంతాల్లో విసృ్తతంగా పర్యటించారు.
నిజాం నవా బు కాలంలో నిర్మించిన ఈ మార్కెట్‌కు 110 ఏండ్లకు పైగా షాపింగ్ చరిత్ర ఉన్నదని, అనేకమంది చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆధారపడి ఉన్నారని ఈ సందర్భంగా అరవింద్ కుమార్‌కు మంత్రి తలసాని వివరించారు. వ్యాపారానికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించామని, 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
నివేదిక రాగానే అక్కడి వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు పాలికాబజార్ చౌరస్తా నుంచి మోండా మార్కెట్లోని కూరగాయల బజార్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, పాత గాంధీ దవాఖాన గోదాంను తొలగించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. పాత జైలు ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టీలెవల్ పార్కింగ్‌ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ దీపిక, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసిపి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్, ఆగస్టు 26: నగరంలోని వక్ఫ్ బోర్డు స్థలంలోనే పేద ముస్లిం కుటుంబాలకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్లోని జీవైఆర్ కాంపౌండ్, పొట్టి శ్రీరాములు నగర్, బండ మైసమ్మ నగర్ బస్తీలలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలలో ఆయన పర్యటించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, హైద్రాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, తహసీల్దార్ బాలశంకర్, కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, హౌజింగ్ ఈఈ ఎం.వెంకట్‌దాస్ రెడ్డి ఇతర అధికారులు కలసి జీవైఆర్ కాంపౌండ్‌లో స్థలాన్ని పరిశీలించారు.
ముస్లిం శ్మశాన వాటిక పక్కనున్న కొంత స్థలం కేటియిస్తే ఎన్నో ఏండ్ల నుంచి నివసిస్తున్న 12 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలనుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పడంతో వక్ఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ సలీమ్ తెలిపారు. అలాగే, అక్కడ ఆలయం నిర్మించే ప్రదేశంలో మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. పొట్టి శ్రీరాములు నగర్లో మరికొందరు లబ్దిదారుల ఆధారాలను పరిశీలించి, వాటిని ధ్రువీకరించాక ఇండ్ల కేటాయింపు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బండ మైసమ్మ నగర్ బస్తీలో మరో అదనపు బ్లాక్ నిర్మాణ పనులను పరిశీలించారు. దీపావళి లోగా ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, పవన్ కుమార్ గౌడ్, ఎంఏ ఫహీమ్, ఎమ్డీ అబ్బాస్ పాల్గొన్నారు.