
అమీర్‌పేట్, ఆగస్టు 24 : సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యదవ్ అన్నారు. సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్ డివిజన్లకు చెందిన 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెరిగేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఒకరిపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితులు లేకుండా వితంతువులు, అనాథలు, వృ ద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందుతున్నాయన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు దేశంలోనే ఇప్పటివరకు ఎవరూ అమలు చేయని పథకమన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న నిరుపేదలు ఆత్మగౌరవ జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒకరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డితో పాటు ఖైరతాబాద్ , అమీర్‌పేట్ డిప్యూటీ తాసీల్దార్లు అశోక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.