
బన్సీలాల్‌పేట్, ఆగస్టు 22: చరిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన కార్పొరేటర్ కే.హేమలత, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బన్సీలాల్‌పేట్‌లోని పురాతన మెట్ల బావి పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 40 ఏండ్ల క్రితం స్థానికులు ఈ బావిలోని నీటిని అనేక రకాలుగా వినియోగించేవారని అన్నారు. కాలక్రమేనా చెత్తాచెదారం వేయడం వల్ల పూర్తిగా మూసుకుపోయి, నిరుపయోగంగా మారిందని అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడంతో స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాక ఈ బావిలో తాగునీరు ఎల్లప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్, జలమండలి ఏఈ శశాంక్, ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్, టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, వెంకటేశన్రాజు, ప్రేమ్‌కుమార్, కమల్‌కుమార్, దేశపాకశ్రీను, శ్రీకాంత్, జ్ఞానీ, బన్సీలాల్‌పేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫహీమ్, కార్యదర్శి పురుషోత్తమ్, సీమా, భాగ్యలక్ష్మి, జావెద్ తదితరులు పాల్గొన్నారు.