
మారేడ్‌పల్లి, ఆగస్టు 21: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మురుగు నీటి నిర్వహణలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మోండా డివిజన్ మారేడ్‌పల్లి నెహ్రూనగర్ మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్లో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మురుగునీటి నిర్వహణ, భద్రతపై అవగాహన, పక్షోత్సవాల కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, జలమండలి ఎండీ దానకిశోర్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…మురుగు నీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్హోల్స్ల్లో పూడిక తొలగింపు జరుగుతుందన్నారు. 2014 కంటే ముందు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిత్యం ఆందోళనలు జరిగేవని, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. అనంతరం ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…నగర ప్రజలందరికి తాగునీరు అందించడంతో జలమండలి అధికారులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని అన్నారు. అనంతరం జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. నగరంలో 9 వేల కిలో మీటర్ల మేర సివరేజీ పైప్‌లైన్ వ్యవస్థ, 25ఎస్టీపీలు ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మారేడ్‌పల్లి జలమండలి జీఎం రమణారెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీధర్‌బాబు, సీజీఎం ప్రభు, కార్మిక సంఘం నాయకులు రాంబాబు, డీజీఎం కృష్ణ, కార్పొరేటర్లు, దీపిక, హేమలత, సుచిత్ర, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, మాజీ జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహాముదిరాజ్, నాయకులు హరికృష్ణ, హరిబాబు పాల్గొన్నారు.