
బేగంపేట్ ఆగస్టు 20: మలేరియా వ్యాధి కారక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్ రొనాల్డ్ రోస్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ దోమల నియంత్రణ దినం సందర్భంగా శుక్రవారం బేగంపేట్‌లోని సర్ రొనాల్డ్ రోస్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొనాల్డ్ రోస్ పోస్టల్ కవర్‌ను ఆయన విడుదల చేశారు. అనంతరం, మంత్రి తలసాని మాట్లాడుతూ, ఇదే భవనంలో అనే క పరిశోధనలు చేసి 1897వ సంవత్సరం ఆగస్టు 20న మలేరియా మహమ్మారి మూలాలను రొనాల్డ్ రోస్ తెలిపారన్నారు. రొనాల్డ్ రోస్ కృష్టికి ఫలితంగా 1902వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావటం వైద్య చరిత్ర లో ఒక మైలు రాయిగా నిలిచిందన్నారు.
మలేరియా వ్యాధి బారిన పడి చనిపోతున్న వారిని చూసి చలించిపోయిన రొనాల్డ్ రోస్ వారిని కాపాడాలనే లక్ష్యంతో అనేక పరిశోధనలు చేశారన్నారు. నీటిలో దోమలు లార్వా దశలో ఉండటం వల్ల వాటి పెరుగుదలను సులువుగా నివారించవచ్చని, తద్వారా వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. ఇంకా ప్రజలలో దానిపై సరైన అవగాహన లేకపోడవం కొంత మంది పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోకుండా ఉండటంతో ప్రజలు వ్యాధుల బారి న పడుతున్నారని మంత్రి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓయూ వీసీ రవిందర్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, ప్రొఫెసర్లు లక్ష్మీ నారాయణ, రెడ్యానాయక్, బాలకిషన్, రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.