సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: రాష్ట్రంలోని అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్‌పేట నియోజకవర్గంలోని నింబోలి అడ్డాలోని అనాథ బాలికల ఆశ్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వసతి గదులు, తరగతి గదులు, కళావేదిక ఇలా అన్నింటిని నిశితంగా పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సక్రమంగా అందిస్తున్నారా? అని మంత్రి బాలికలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాలికలకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మంత్రికి వివరించారు. ఆనంతరం మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు, డైరెక్టర్ శైలజలు బాలికలతో కలిసి భోజనం చేశారు.
బాలికల కోసం అమలు చేస్తున్న మెనూ పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లలకు, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి వారిని ఆదుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు. అందులో భాగంగానే అనాథ పిల్లలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పించడానికి, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమో గుర్తించడానికి, సమస్యలపై అధ్యయనం చేయడానికి సీఎం 8 మంది మంత్రులతో ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారని మంత్రి తలసాని వివరించారు. అనాథ పిల్లల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమం ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్, ఆశ్రమం ఇన్చార్జి సూపరింటెండెంట్ గౌతమి తదితరులు పాల్గొన్నారు.