
అమీర్‌పేట్, ఆగస్టు 9 : రాంగోపాల్‌పేట్ డివిజన్లోని ఆర్పీ రోడ్డులో రూ. 2.35 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలిస్తూ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మట్లాడుతూ వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు రోడ్లపైకి చేరుతుండడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతుండడమే కాక ముంపు సమస్యకు దారి తీస్తోందన్నారు. అయితే ఈ వంతెన విస్తీర్ణం పెరిగితే వరదనీరు సాఫీగా పోయేందుకు అవకాశం ఉందని నిపుణులు చేసిన సూచనల మేరకు వంతెన విస్తరణ పనులను చేపట్టామని తెలిపారు. అయితే సంబంధిత పోలీస్, జీహెచ్ఎంసీ విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించి వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అ న్నారు. నిర్మాణం ఒకవైపు పూర్తయిన పరిస్థితుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయని వివరించారు. డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, ఎస్ఈ అనిల్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్, జలమండలి జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్ పాల్గొన్నారు.