
వనస్థలిపురం, ఆగస్టు 6 : దళితబంధు పథకం ద్వారా ఎస్సీ కులాల్లో పేదరికం దూరమవుతుందని ఎస్సీ హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గంగం శివశంకర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు ఎంతో పేదరికంలో ఉన్నారన్నారు. ఉపాధి లేక అల్లాడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి రూ.10లక్షలు అందజేస్తే వ్యాపారాలు పెట్టుకోవడం, వాహనాలు కొని అద్దెకు నడుపుకోవడం లాంటివి చేసుకుంటారన్నారు. కుటుంబ పోషణకు, ఆదాయం పొందేందుకు ఆ సొమ్ము ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద దళితులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.