
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఆషాడ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఉత్సవాల నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు,పలు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 11వ తేదీన ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వచ్చే నెల 5తేదీన గోల్కొండలో ఆలయ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 13వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఏర్పాట్లపై వచ్చే నెల 6 తేదీన ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 25న జరపనున్న సికింద్రాబాద్ బోనాల నిర్వహణపై సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో సమావేశం నిర్వహిస్తామన్నారు.ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జంగ్ మ్యూజియంలో పలు ఆలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వాహకులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు.