Minister Srinivas Yadav | తెలంగాణ సంస్కృతికి ప్రతీక నిలిచే బోనాల వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి తలసాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన శాంతియాగం, చండీహోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వివిధ భాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలు, గణేశ్ నవరాత్రులు, రంజాన్, క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి లక్షల మంది భక్తులు వచ్చారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగినట్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
బోనాల ఉత్సవాలను తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. పండుగలు నేడు దేశ విదేశాల్లో జరుపుకోవడం మన అందరికీ గర్వకారణం అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అనేక దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.