హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వెలవెలబోయిన వ్యవసాయ శాఖకు సీఎం కేసీఆర్ వన్నె తెచ్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విప్లవాత్మకమైన వ్యవసాయ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో రైతులకు గౌరవం, అధికారుల విలువ పెరిగిందన్నారు. మంగళవారం విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్(టాడా) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు వ్యవసాయశాఖ అంటే తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ ఈ శాఖను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అధిక బడ్జెట్ కేటాయిస్తూ రైతులకు మేలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సేవలు కూడా మరువలేనివన్నారు. గతంతో పోల్చితే ఉద్యోగుల ఎంతో నిబద్ధతతో పని చేస్తూ ప్రభుత్వ పథకాలను రైతులకు చేరేలా చేస్తున్నారని ప్రశంసించారు. తన దృష్టికి తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు మంచి చేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టాడా గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, అసోయేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కె. రాములు, అధ్యక్షుడు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.