
హఫీజ్‌పేట్, ఆగస్టు14, మనిషి నాగరికత రూపాంతరం చెందిన విధానాన్ని కళారూపాల ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం గొప్పదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీలో ఆద్యకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళారూపాల ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసులు, గిరిజన జాతుల అభివృద్ధిలో చోటుచేసుకున్న పరిణామాలను కళ్లకు కట్టినట్లు విశదీకరించేందుకు ఆద్యకళ ఒకవేదిక అయ్యిందన్నారు. అలాంటి కళారూపాలను వెలికితీయడంలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొ. తిరుమలరావు చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రదర్శనలో ఉంచిన పరికరాలు, సంగీతవాయిద్యాలు, దేవతామూర్తుల విగ్రహాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొ. తిరుమలరావు పాల్గొన్నారు.