రవీంద్రభారతి, అక్టోబరు 2: గౌడ జాతి నుంచి మరెంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రావాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యాన శనివా రం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో సివిల్ సర్వీసెస్‌లో 541 ర్యాంకు సాధించిన డాక్టర్ పృథ్వీనాథ్ గౌడ్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరై పృధ్వినాథ్ గౌడ్‌ను అభినందించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ పృథ్వీనాథ్ గౌడ్ సివిల్ సర్వీస్‌లో 541 ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.
గౌడ కులస్థులు ఎంత పేదరికంలో ఉన్నా తమ పిల్లలను కష్టపడి చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. పిల్లలకు ఆస్తులు ముఖ్యం కాదని, వారికి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దినప్పుడే దేశం, కన్న తల్లిదండ్రులు గర్వపడుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పృధ్వినాథ్ గౌడ్ తల్లిదండ్రులను మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, అఖిల భార త గౌడ సంఘం తెలంగాణ అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, గౌడ సంఘాల ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, మిద్దెల మల్లేష్ గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, బాల్‌రాజ్ గౌడ్, కొండ గిరిగౌడ్, లక్ష్మణ్ గౌడ్ , బృందాకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సంగారెడ్డి గౌడ సంఘం అధ్యక్షుడు పాల్గొన్నారు.