హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాదులోని నీటి సరస్సుల్లో పెరుగుతున్న గుర్రపుడెక కలుపుమొకల నివారణకు చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ముఖ్యంగా సరూర్‌నగర్ సరస్సులో పరిస్థితి దారుణంగా మారి దోమల పెరుగుదలకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సమస్యపై ప్రజా ప్రతినిధులు, ముఖ్యం గా ఎమ్మెల్యే పలుమార్లు ప్రస్తావించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది.
ప్రజారోగ్యంపై నేరుగా ప్రభావం చూపే ఈ సమస్యను వెంటనే పరిషరించాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ జీహెచ్ఎంసీ, హైడ్రా, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేశారు. సైదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త డీ కీర్తికిరణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. దోమల వ్యాప్తిని నివారించేందుకు ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, ప్రత్యేక బృందాల నియామకం, నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తీసుకున్న చర్యలపై కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసును ఏప్రిల్ 16కు వాయిదా వేశారు.
చెరువుల్లో గుర్రపుడెక పెరగడం వల్ల దోమల సమస్య తీవ్రంగా మారిందని పిటిషనర్ కోర్టు దృష్టి కి తెచ్చారు. సరస్సు ఫొటోలు సమర్పించడంతోపా టు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డీ సుధీర్‌రెడ్డి అసెంబ్లీలో దోమల సమస్యపై నిరసన తెలపడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని.. ప్రజలు, ప్రజాప్రతినిధు లు సమస్యను లేవనెత్తినప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే ఎలాగని ప్రశ్నించింది. సరస్సును పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందని ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.