హైదరాబాద్, ఏప్రిల్ 11: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..కొనుగోలుదారులకు షాకివ్వబోతున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ఇప్పటికే పలు వాహన సంస్థలు ధరలు పెంచగా..తాజాగా ఇదే జాబితాలోకి మారుతి కూడా చేరబోతున్నది. ప్రస్తుత త్రైమాసికంలోనే వాహన ధరలను పెంచబోతున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ సంకేతాలిచ్చారు. ఎప్పటి నుంచి, ఎంత శాతం మేర పెంచేదానిపై ఆయన సమాధాన్ని దాటవేశారు. కంపెనీకి చెందిన 108 ఈ-విటారా యూనిట్లను బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శనివారం ఆయన హైదరాబాద్‌లో అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ-విటారాను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, దేశంలో ఏ నగరంలో లేనంత ఈవీల వినిమయం హైదరాబాద్‌లో అత్యధికంగా 14.5 శాతంగా ఉన్నదన్నారు.
నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింటు అందుబాటులో ఉండటం కూడా ఈవీల వినిమయానికి ఊపునిచ్చిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 256 ఛార్జింగ్ పాయింట్లు ఉండగా, వీటిలో 119 ఒక హైదరాబాద్‌లో ఉండటం విశేషమన్నారు. అలాగే 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పటికే 2 వేల చార్జింగ్ స్టేషన్లను సంస్థ నిర్వహిస్తున్నది. మరోవైపు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కంపెనీ ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల యూనిట్ల వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అలాగే 25 వేల యూనిట్ల ఈ-విటారా కార్లు 44 దేశాలకు ఎగుమతి చేసింది.
ఐదేండ్లలో మరో నాలుగు ఈవీలు
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2031 నాటికి మరో నాలుగు ఈవీ మాడళ్లను తీసుకురాబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ-విటారా సింగిల్ చార్జింగ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీలపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వ్యారెంటీని కల్పిస్తున్నది. ఈ మాడల్‌పై భారత్ ఎన్‌క్యాప్ 5-స్టార్ రేటింగ్ కూడా ఇచ్చింది. ఈ-విటారాను కొనుగోలు చేసిన వారికి ఏడాది పాటు రూ.20 వేల విలువైన చార్జింగ్తోపాటు రూ.50 వేల విలువైన హోమ్ చార్జర్‌ను కూడా ఉచితంగా చేసుకునే ప్యాకేజిని అందిస్తున్నది.