
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 9: కళాకారుడి కుంచె నుంచి జాలువారే చిత్రాలు మానవాళికి మంచి సందేశాన్ని ఇస్తాయని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో కళాకారుడు కూరేళ్ల శ్రీనివాస్ చిత్రముఖ 108 వాటర్ కలర్ పోట్రెయిట్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ. రమణారెడ్డి, జేఎన్ఏఎఫ్ఏయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టిస్ట్ కూరేళ్ల శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిత్ర కళాకారుడి కుంచె నుంచి జాలువారే ప్రతిచిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే పెయింటింగ్‌పై తనుకున్న మక్కువతో ఎన్నో చిత్రాలను పెయింటింగ్ చేస్తూ అందరి మన్ననలను అందుకోవడం అభినందనీయమన్నారు. కొవిడ్ విపత్కర సమయంలో కూడా సామాజిక సేవ చేస్తున్న వారిని గుర్తించి, ప్రముఖ రచయితల, కవుల, కళాకారుల చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించడం పట్ల ఆర్టిస్టు శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్టిస్టు కూరేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొవిడ్ విపత్కర సమయంలో ఆర్టిస్టులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు క్లిష్ట తరమైన వాటర్ కలర్ ప్లోరైట్ను సుసాధ్యం చేసేందుకు మే18 నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ప్రతినిత్యం ఓ చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్నతో ప్రముఖుల చిత్రాలను ఒక్కరోజులో సాధ్యం కాకున్నా.. ఒక చిత్రాన్ని చిత్రీకరించి ఆర్ట్ మిషన్‌ను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులు అన్నారపు నరేందర్, నాగుల రాజేందర్, శ్రీనివాస్ నాయక్, అప్లయిడ్ ఆర్ట్ హెచ్‌వోడీ గంగాధర్, ప్రొఫెసర్ కొడాలి సుందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.