
హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలన్న లక్ష్యంతో నూతన క్రీడా పాలసీని ప్రత్యేక ప్రణాళికలతో రూపాందిస్తున్నమని రాష్ట్ర క్రీడల, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే క్రీడ మైదానంలో ముఖేష్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడా రంగాన్ని విశ్వక్రీడా నగరంగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారించే విధంగా నూతన క్రీడా పాలసీ ఉండబోతుందని ఆయన తెలియజేశారు.
క్రీడల అభివృద్థికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ దేశంలోనే అత్యున్నత స్థాయికి క్రీడకారులను తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి ముఖేష్, రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖేష్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్లో రంగారెడ్డి జిల్లా జట్టు శుభారంభం చేసింది.
ఆదివారం సికింద్రాబాద్ రైల్వే క్రీడ మైదానంలో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి జిల్లా జట్టు 10-01 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మహబుబ్నగర్ జిల్లా జట్టు 8 -2 గోల్స్ తేడాతో ఖమ్మం జిల్లా జట్టు పై గెలుపొందింది.