
రవీంద్రభారతి, ఆగస్టు 24: ప్రాజ్ఞిక ఫౌండేషన్ ఆర్ట్స్ అకాడమీ- సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెండితెర వెలుగులు – స్వరాభిషేకం అనే పాటల కార్యక్రమాన్ని మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సినిమా రంగానికి, కళలకు, కళాకారులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తెలంగాణలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేయూతనందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు స్వరాభిషేకం-5 పురస్కారాలను తెలంగాణ యూనివర్సిటీ ఉప కులపతి దాచేపల్లి రవీందర్ గుప్తా, ఘంటసాలగా పేరుగాంచిన గాయకుడు చంద్రతేజకు ఆత్మీయ గాన పురస్కారాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు గాయకులు ఆలపించిన అలనాటి పాటలతో సభ ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సరస్వతీ అవధాని దైవజ్ఞశర్మ, గాంధీ తదితరులు పాల్గొన్నారు.