AI Global Summit | సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞానం మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ కార్యక్రమంగా ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను సెప్టెంబర్ 5-6 తేదీల్లో నిర్వహిస్తోంది.
ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా ప్రారంభించారు. హెచ్ఐసీసీ వేదికగా 2 రోజుల పాటు జరిగే సమ్మిట్‌పై దేశ, విదేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సదస్సులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలను ఎంపిక చేసి, వాటిపై విస్త్రత అనుభవం ఉన్న నిపుణులతో కీలక ప్రసంగాలు చేసేలా.. షెడ్యూల్స్‌ను నిర్ణయించారు.
ఏఐ ఫర్ సోషల్ చేంజ్, సేఫ్ ఏఐ, పుషింగ్ బౌండరీస్ ఆఫ్ ఇన్నోవేషన్, పారడిజిమ్ షిప్ట్ ఇన్ ఇండస్ట్రీ తదితర అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యోట్టా, ఎన్విదియా వంటి టెక్నాలజీ కంపెనీలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయని ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటితో పాటు ఇండస్ట్రీ పార్ట్నర్స్ హైసీయా, సీఐఐ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నాలెడ్జ్ పార్టనర్‌గా నాస్కామ్లు ఉన్నాయని తెలిపారు.
10న నల్సార్‌లో..
శామీర్‌పేటలోని నల్సార్లా విశ్వవిద్యాలయంలో ఏఐ సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆగస్టు 10న వర్సిటీలో సదస్సు ఉంటుందన్నారు.